50 కోట్ల షేర్ క్లబ్బులో రుద్రమదేవి




మొత్తానికి బాక్సాఫీస్ యుద్ధంలో రుద్రమదేవి విజయం సాధించిందనే చెప్పాలి. విడుదలకు ముందే కాదు తర్వాత కూడా రుద్రమదేవి ప్రతాపం గురించి చాలా సందేహాలున్నాయి జనాలకు. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ డివైడ్ టాక్ ను తట్టుకుని మరీ బాక్సాఫీస్ లో జయకేతనం ఎగుర వేసింది గుణశేఖర్ సినిమా. ఇప్పటికే 50 కోట్ల షేర్ క్లబ్బులో అడుగుపెట్టిన అతి కొద్ది తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది రుద్రమదేవి. ప్రస్తుతం నాలుగో వారంలో ఉన్న రుద్రమదేవి ఆంధ్రా ఏరియాలో దాదాపుగా పరుగు ఆపేసింది కానీ.. నైజాం ఏరియాలో మాత్రం ఇప్పటికీ చెప్పుకోదగ్గ థియేటర్లలో ఆడుతోంది. అక్కడ కలెక్షన్ల షేర్ దాదాపు రూ.16 కోట్లకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బౌండరీస్ దాటి కూడా రుద్రమిదేవి సత్తా చాటింది. తమిళనాడు - కర్ణాటక - కేరళల్లోనూ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఇక ఆశ్చర్యకరంగా యుఎస్ లోనూ ‘రుద్రమదేవి’ అనూహ్యమైన వసూళ్లు సాధించింది. అక్కడ ఈ సినిమా మిలియన్ క్లబ్ అందుకుని ఆశ్చర్యపరిచింది. ‘బాహుబలి’ని మినహాయిస్తే.. యుఎస్ లో సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లకే మంచి వసూళ్లు దక్కుతాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘రుద్రమదేవి’ అక్కడ నిలబడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఐతే అక్కడ కూడా ‘రుద్రమదేవి’ లాంగ్ రన్ రావడం.. మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

మంత్రికి భార్యే కమీషన్ల ఏజెంటు





ఒక కర్ణాటక మంత్రిగారికి తన భార్యే కమీషన్ ఏజెంటుగా పనిచేస్తోంది. అయ్యగారి దందాలకు పేమెంట్లు ఇంట్లో ఇస్తున్నారో లేదంటే అయ్యగారి పేరు చెప్పి అమ్మగారే దందాలు చేస్తున్నారో తెలియదు.  కానీ పచ్చనోట్ల కట్లలు మాత్రం పెట్టెల్లో నిండిపోతున్నాయి.  చాలాకాలంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఒక టీవీ ఛానల్ తన స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టేసింది. 

విద్యార్థుల హాస్టళ్లకు ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ కేటాయింపులకు సంబంధించిన వ్యవహారంలో కమీషన్ తీసుకుంటూ కర్ణాటక సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఆంజనేయ భార్య విజయ కెమేరాలకు దొరికింది.  ఈ దృశ్యాలు టీవీఛానల్స్ లో  ప్రసారమైన వెంటనే ఆంజనేయపై విపక్షాల దాడి మొదలైంది. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా  చేయాలంటూ విపక్ష బీజేపీ నేతలు  డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అవినీతికి ఆయన భార్య కూడా తోడయ్యారంటూ వారు మండిపడుతున్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లకు బియ్యం - పప్పుధాన్యాలు - నూనె తదితర పదార్థాల సరఫరా కాంట్రాక్టు తమకు ఇప్పించాలంటూ ఒక టీవీ ఛానల్ ప్రతినిధులు మంత్రి ఆంజనేయ భార్య విజయను సంప్రదించారు. ఆమెకు రూ.7 లక్షల నగదును కమీషన్ రూపంలో అందజేశారు. ఇదంతా రహస్య కెమేరాల్లో వారు చిత్రీకరించారు.  గురువారం ఇదంతా టీవీల్లో ప్రసారమవడంతో కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత జరిగినా ఆంజనేయ మాత్రం  ఏమాత్రం తొణకలేదు బెణకలేదు. పైగా తాను దళితుడిని కావడం వల్లే ఇలా అల్లరి చేస్తున్నారంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు.

ఐఏఎస్ అధికారి ఇళ్లంతా బూతు సినిమాలు




మొదటినుంచీ ఆయన వివాదాస్పదుడు ,  అంతా తాను చెప్పినట్లే నడవాలన్న అధికార మదం,  సీనియర్ నంటూ అహంకారం,  ఇవి చాలవన్నట్లుగా అవినీతి - అక్రమాలు - ఆదాయానికి మించి ఆస్తులు ఇలా ఎన్నో...  ఇప్పుడు తాజాగా మరొకటి బూతు సీడీలు ఇదంతా ఎవరో పెద్ద నేరగాడి చరిత్ర కాదు. సమాజంలో ఉన్నత స్థానంలో కలిగిన ఐఏఎస్ అధికారి కథ . ఆయన ఎవరో కాదు కర్ణాటకలో  సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆ రాష్ట్ర క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి కపిల్ మోహన్ వ్యవహారం. 

తాజాగా ఆయన ఇంట్లో చిన్నపిల్లల నీలిచిత్రాలు ఉన్న సీడీలు - హార్డ్ డిస్క్ లు దొరకడం కలకలం రేపింది.  కపిల్ మోహన్ ఉంటున్న అపార్ట్ మెంట్ లో సీఐడీ - ఐటీ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 5న సంయుక్తంగా సోదాలు చేశారు.  రూ.4.30 కోట్ల నగదు - వజ్రాభరణాలు -  28 సీడీలు - ఒక హార్డ్ డిస్క్ ను వారు స్వాధీనం చేసుకున్నారు.  అయితే... స్వాధీనం చేసుకున్న సీడీలు - హార్డ్ డిస్క్ లను లోకాయుక్త కు ఇవ్వగా దాన్ని తెరిచిన వారు షాక్ తిన్నారు. ఆ సీడీల్లో సాధారణ నీలిచిత్రాలతో పాటు కొన్నిటిలో చైల్డ్ పోర్నోగ్రఫీ దృశ్యాలు ఉన్నాయని గుర్తించారు. హార్డ్ డిస్కు నిండగా కూడా బూతు బొమ్మలే ఉన్నాయట. దీంతో  బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ కు లోకాయుక్త సంస్థ ఏడీజీపీ ప్రేమ్ కుమార్ మీన లేఖ రాశారు.  ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరారు. దెబ్బకు కపిల్ మోహన్ పై అక్రమాస్తుల కేసులతో పాటు పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులనూ పెట్టారు. అంత ఉన్నతాధికారికి ఇదేమి పాడుబుద్దో అంటున్నారు అందరూ

ఛోటా రాజన్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ




అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటా రాజన్ ను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7.45 గంటలకు ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీబీఐ, ముంబై, ఢిల్లీ పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఛోటా రాజన్ ను తీసుకుని భారత్ బయలుదేరారు. శుక్రవారం వేకువ జామున 5 గంటల సమయంలో ఢిల్లీ లోని పాలం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలీసులతో పాటు స్వాట్ టీమ్స్ ను విమానాశ్రయంలో మోహరించారు. న్యూఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఛోటా రాజన్ ను వుంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్బంగా సీబీఐ కార్యాలయం చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
ముఖ్యాంశాలు :  

సుమారు 100 కేసులు :  భారత్‌లో ఛోటా రాజన్‌పై హత్యలు, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు తదితర 100 వరకు కేసులున్నాయి. వాటిలో దాదాపు 70 ముంబై నగరంలోనే నమోదైనాయి. ఢిల్లీలో 10 కేసులకు పైగా నమోదు అయ్యాయి.

25 ఏళ్ల తరువాత : ఉగ్రవాద నిరోధక చట్టం, టాడా, మోకా తదితర కఠిన చట్టాల కింద ఛోటా రాజన్ పై కేసులున్నాయి. పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో ఛోటా రాజన్ దుబాయి పారిపోయాడు.

దావూద్ ప్రధాన అనుచరుడు :  అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు ప్రధాన అనుచరుడైన ఛోటా రాజన్ 1993 ముంబై పేలుళ్లను తీవ్రస్థాయిలో వ్యతిరేకించాడు. తరువాత ‘డీ' గ్యాంగ్‌కు దూరమయ్యాడు.

అనుచరుడే శత్రువు  : ముంబైలో 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో అమాయకులు బలయ్యారని ఛోటా రాజన్ తన గురువు దావూద్ మీద తిరుగుబాటుకు దిగాడు. అనంతరం దావూద్ ఇబ్రహీంకు ప్రధాన శత్రువుగా మారాడు.

వెంటాడి చంపేశాడు : ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన తరువాత డీ గ్యాంగ్ లోని గ్యాంగ్ స్టర్స్ మీద ఛోటా రాజన్ కన్ను వేశాడు. డీ గ్యాంగ్ లోని వారు కనపడితే తన అనుచరులతో ఎక్కడపడితే అక్కడ అంతం చేయించాడు.

అదే అతని ధైర్యం : దావూద్ ఇబ్రహీం ప్లాన్ లు, అతని కదలికలు మొత్తం దగ్గర నుంచి చూసిన ఛోటా రాజన్ ఎక్కడా పప్పులో కాలు వెయ్యలేదు. డీ గ్యాంగ్ నుంచి తప్పించుకునేందుకు అతను అనేక ప్లాన్ లు వేశాడు.

అనారోగ్యం : ఛోటా రాజన్ అనారోగ్యంతో భాదపడుతున్నాడు. అతను కిడ్నీ వ్యాదితో డయాలసిస్ చేయించుకుంటున్నాడు.

అధికారుల అండ  : దావూద్ ఇబ్రహీంను అంతం చెయ్యాలన్నా, అతని గురించి సమాచారం కావాలన్నా తనను వదిలి పెట్టాలని, తనకు సహకరించాలనే షరతులతో ఛోటా రాజన్ గతంలో భారత్ కు చెందిన కొందరు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

చేతులు దులుపుకున్న మహారాష్ట్ర  : ముంబైలో ఛోటా రాజన్ మీద నమోదు అయిన అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునింది. 

 

అరకులో నాని సినిమా షూటింగ్ !



‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్ కొట్టి స్టార్ స్టేటస్‌ని తెచ్చుకున్న  హీరో నాని. తన సహజమైన నటన, మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ యువహీరో ప్రస్తుతం భలే భలే మగాడివోయ్ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అందాల రాక్షసి సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఒక మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అరకు ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‍లో పలు కీలక సన్నివేశాలతో పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విశాల్ శేఖర్ చంద్ర సంగీతంలో రూపొందిన ఆడియో ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఫస్ట్‌లుక్‌తో పాటే సినిమా టైటిల్‌నూ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. నాని ఈ సినిమాలో బాలకృష్ణ అభిమాని పాత్రలో కనిపించడం విశేషం.   More

బాలయ్య ‘డిక్టేటర్’ ఆడియో విడుదల తేది



ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకునే ననదమోరి బాలకృష్ణ తన కెరీర్లోనే చాలా డిఫరెంట్ మూవీగా నిలిచిపోవాలని చేస్తున్న సినిమా ‘డిక్టేటర్’. బాలయ్య 99వ సినిమాగా వస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు కానుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఆడియోని ఆంధ్రపదేశ్ సరికొత్త రాజధాని అయిన అమరావతిలో చేయడానికి నిర్ణయించాడు. కొత్త రాజధాని అమరావతిలో జరగనున్న మొట్ట మొదటి సినిమా ఆడియో లాంచ్ కావడంతో భారీ ఎత్తున చేయడానికి నిర్ణయించారు.

ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేసింది. తాజాగా అమరావతిలో లాంచ్ చేయనున్న డిక్టేటర్ ఆడియోకి కూడా రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసేసింది. తమన్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ 1 కల్లా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని ఫినిష్ చేయనున్నారు. ఆ తర్వాత బాలన్స్ ఉన్న సాంగ్స్ ని షూట్ చేస్తారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించిన ఈ సినిమాని ఎరోస్ వారితో కలిసి శ్రీవాస్ నిర్మిస్తున్నాడు.  More

బంగారం డిమాండ్ తగ్గించే చర్యలు చేపట్టిన మోడీ



దేశంలో నిరుపయోగం పడివున్న బంగారం నిల్వలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు బంగారం డిపాజిట్ల పథకాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... దేశంలో 20 వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇంత బంగారం ఉన్న భారత్ పేద దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బంగారం నిల్వలను వెలికితీసి డిమాండ్ తగ్గించే చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

బంగారం డిపాజిట్ల పథకాలతో మహిళలు ఆర్థికంగా సాధికారత సాధికారత సాధిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల కారణంగానే ఇలాంటి పథకాలు విజయవంతం అవుతున్నాని అన్నారు. బంగారాన్ని ఇంట్లో దాచుకుందామన్న భయపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. బంగారం డిపాజిట్ పథకంలో బాండ్ల రూపంలో భద్రత ఉంటుందని భరోసాయిచ్చారు. బాండ్లు దొంగిలించినా పెద్దగా ప్రయోజనం ఉండదని వివరించారు.